సీమాంధ్ర పదబంధం పుట్టుక: కొత్త పదాల దేవులాట
కొత్త పదాలు (New Words), పదబంధాలు ఎలా పుడుతాయి? ఎలా వాడకంలోకి, ప్రచారంలోకి వస్తాయి? ఎవరు సృష్టించారో, ఏ అవసరం కోసం సృష్టించారో తెలియకుండానే కొన్ని పదాలు, పదబంధాలు విశేషంగా వాడుకలోకి వచ్చి, సమాజంలో స్థిరపడిపోతాయి. నిజానికి, మీడియాలో కొత్త పదాలూ పదబంధాల పుట్టుక నిత్యం జరుగుతూ ఉంటుంది. భాషతో ప్రయోగాలు జరుగుతుంటాయి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికే ఈ ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకు భాష (Laguage)పై పట్టు ఉండాలి. అవసరం కోసం కొత్త పదాన్ని, పదబంధాన్ని సృష్టించడానికి అది అవసరం.
నేను వన్ ఇండియా తెలుగు చానెల్ సంపాదకుడిగా పనిచేసిన కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం (Telangana Movement) పెద్ద యెత్తున సాగుతున్నది. తెలంగాణేతర ప్రాంతాన్ని చెప్పడానికి నాకు ఓ పదబంధం అవసరమైంది. ఆంధ్ర ప్రాంతం (Andhra Region) అనేస్తే రాయలసీమ (Rayalaseema)కు అన్యాయం చేసినట్లవుతుంది. అది రాయలసీమ ప్రత్యేకత పట్ల నాకున్న గౌరవం వల్ల, రాయలసీమ పట్ల నాకున్న ప్రేమ వల్ల అవసరమనిపించింది. చాలా ఆలోచించాను. రాయలసీమ, కోస్తాంధ్ర (Coastal Andhra) అనే రెండు పదాలు వాడడం వల్ల శీర్షికకు బిగువు రావడం లేదు, పైగా అది పెద్దగా అవుతున్నది. రాయల ఆంధ్ర అని వాడుదామని అనుకున్నాను. రాయల ఆంధ్ర అంటే కేవలం రాయలసీమకే పరిమితమవుతుంది. రాయలు పాలించిన ఆంధ్ర కాబట్టి అని అలా అనుకున్నాను.
చివరకు సీమాంధ్ర (seemandhra) అని నిర్ధారించుకున్నాను. సీమ అనేది ప్రాంతం అనే అర్థాన్ని ఇస్తున్నప్పటికీ నాకు సీమ అంటే రాయలసీమ అనే అర్థాన్ని రూఢి చేసుకుంటారని అనుకున్నాను. దాంతో సీమాంధ్ర పదాన్ని నా వార్తాకథనాల్లోనూ, వ్యాసాల్లోనూ వాడుతూ వచ్చాను. అలా సీమాంధ్ర అనే పదబంధం పుట్టి విరివిగా వాడుకలోకి వచ్చింది. తెలంగాణేతర తెలుగు ప్రాంతాన్ని చెప్పడానికి సీమాంధ్ర పదాన్ని అన్ని వర్గాల వారు వాడడం ప్రారంభించారు. ఇది నాకొక గౌరవం.
ఇక మరో విషయం.. నేను ఉదయం దినపత్రిక (Udayam Daily) హైదరాబాద్ సిటీ (Hyderabad city) స్పెషల్ ఇంచార్జీగా పనిచేస్తున్నప్పుడు జరిగింది. ఇప్పుడు సచివాలయం గేటు ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు టెంట్లు వేసుకుని దీక్షలు చేసేవారు. రెలే నిరాహార దీక్షలు, ధర్నాలు జరిగేవి. కొన్ని పదుల రోజులు రెలే నిరాహార దీక్షలు సాగుతుండేవి. రెలే నిరాహార దీక్ష ప్రారంభమైన రోజు వార్త మాత్రమే వస్తూ ఉండేది. ఆ తర్వాత మీడియా (అప్పుడు ప్రధానంగా పత్రికలే) పట్టించుకునేది కాదు. నాకు అది నచ్చలేదు.
స్థానిక విలేకరికి చెప్పి ఎవరి దీక్ష ఎన్ని రోజులకు చేరుకుంది. రోజువారీగా వార్త రాయాలని చెప్పాను. అలా వచ్చిన వార్తను ధర్నా చౌక్ (Dharna Chowk) అనే శీర్షిక కింద ప్రచురించేవాళ్లం. నేను రిపోర్టింగ్ ఇంచార్జీగా ఉంటే, దొడ్డా శ్రీనివాస్ రెడ్డి డెస్క్ ఇంచార్జీగా ఉండేవాడు. నా ప్రతిపాదనకు శ్రీనివాస్ రెడ్డి అంగీకరించి, ధర్నా చౌక్ ను కొనసాగించాడు. ధర్నా చౌక్ అనే ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఇప్పుడు ఆ ధర్నా చౌక్ ఇందిరా పార్కు (Indira Park) వద్దకు మారింది. మరింతగా అది ప్రజల పట్టింపు నుంచి జారిపోయింది.
అలాగే మరో ప్రతిపాదన కూడా అమలులోకి వచ్చింది. ఉష్ణోగ్రత కాలమ్ ఉండేది. ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలం శీర్షిక పెట్టాలని ప్రతిపాదించాను. చలికాలంలో చలిపులి శీర్షిక కింద ఉష్ణోగ్రత వివరాలను ప్రచురించేవాళ్లం. చలిపులి అంతకు ముందు వాడకంలో ఉన్నదే గానీ మేం వాడిన తర్వాత విశేషమైన ప్రచారంలోకి వచ్చింది.
అలాగే ‘యాది’ అనే పదం చాలా తక్కువ వాడుకలో ఉండేది. తెలంగాణ కథ - దేవులాట అనే పుస్తకం అచ్చేసినప్పుడు దాన్ని బియ్యాల జనార్దన్ రావు (Biyyala Janardhan Rao)కు అంకితం ఇవ్వాలనేది ఆలోచన. ‘తెలంగాణ దేవులాటలో కాలం చేసిన బియ్యాల జనార్దన్ రావును యాది చేసుకుంటూ’ అని అంకితం వాక్యాలను రాశాను. మరో మాట, దేవులాట అనే పదాన్ని వెతుకులాటకు పర్యాయంగా నేను విరివిగా వాడుతూ వచ్చాను. యాది అనే పదం విరివిగా వాడుకలోకి వచ్చి ప్రాచుర్యంలోకి వచ్చింది.
- కాసుల ప్రతాపరెడ్డి (Kasula Pratap Reddy)